China: డ్రాగన్ బుద్ధి... తనకు ఉచితంగా ఇచ్చిన వాటిని తిరిగి ఇటలీకే అమ్ముతున్న చైనా!
- చైనాను కరోనా కబళించినప్పుడు పీపీఈలను పంపిన ఇటలీ
- డొనేట్ చేస్తున్నానంటూ ఇటలీకి అమ్మకం
- చైనా తీరుపై విమర్శలు గుప్పించిన అమెరికా
చైనా వక్ర బుద్ధి ఎలా ఉంటుంటో తెలియజేసే మరో ఉదాహరణ ఇది. చైనాలో కరోనా విజృంభించగానే ఆ దేశానికి ఇటలీ సాయపడింది. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) ను చైనాకు ఉచితంగా పంపించింది. ఇప్పుడు అదే ఇటలీ కరోనా కాటుకు విలవిల్లాడుతోంది. పీపీఈల కొరతతో అల్లాడుతోంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి చైనా యత్నించింది. తమకు ఉచితంగా పీపీఈలను ఇచ్చిన ఇటలీకి... అవే పీపీఈలను అమ్మింది. ఈ వివరాలను స్పెక్టేటర్ మీడియా సంస్థ వెల్లడించింది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా కబళిస్తుండడంతో ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, మానవతా దృక్పధంతో ఇటలీకి పీపీఈలను డొనేట్ చేస్తున్నామని తొలుత చైనా ప్రకటించింది. ఆ తర్వాత చైనా డొనేట్ చేయలేదని... వాటిని అమ్మిందంటూ పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గంలోని ఓ అధికారి మాట్లాడుతూ చైనాపై మండిపడ్డారు. ఇటలీ ఫ్రీగా ఇచ్చిన వాటిని మళ్లీ తిరిగి కొనేలా చైనా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. యూరప్ కు మహమ్మారి సోకక ముందు చైనాలో ఉన్న తన పౌరులను కాపాడుకునేందుకు ఇటలీ టన్నుల కొద్ది పీపీఈలను పంపించిందని చెప్పారు. అవే పీపీఈలను ఇటలీకి పంపించి... దాన్నుంచి సొమ్ము చేసుకుందని మండిపడ్డారు. ఇతర దేశాలకు సాయం చేస్తున్నామని చైనా చెబుతున్న మాటలన్నీ అసత్యాలేనని అన్నారు. ఇతర దేశాలకు సాయం చేయాల్సిన బాధ్యత చైనాపై ఉందని... ఎందుకంటే కరోనా ఇతర దేశాలకు పాకింది చైనా నుంచేనని చెప్పారు.