Salman Khan: ఇప్పుడు భయపడిన వాడే బ్రతుకుతాడు: సల్మాన్ ఖాన్
- మనకు ఏమీ కాదనే ధైర్యం వద్దు
- లాక్డౌన్లో ఇంట్లోనే ఉండాలన్న స్టార్ హీరో
- తన తండ్రిని చూసి 3 వారాలైందని, భయంగా ఉందని వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమకేమీ కాదనే అలసత్వం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం భయపడితేనే మనుగడ సాగిస్తామని చెప్పారు.
దేశ వ్యాప్తంగా 21 రోజల పాటు విధించిన లాక్‌డౌన్ పై తన అనుభవాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తన అన్న సొహైల్ ఖాన్ కొడుకు నిర్వాణ్ తో సల్మాన్ మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన మేమిద్దరం ఇక్కడే ఇరుక్కుపోయాం’ అని చెప్పారు. ‘మీ నాన్నను చూసి ఎన్ని రోజులు అవుతుంది?’ అని నిర్వాణ్ ను సల్మాన్ ప్రశ్నించగా అతను మూడు వారాలు అవుతోంది అని సమాధానం ఇచ్చాడు. ‘నేను కూడా మా నాన్నను చూసి మూడు వారాలైంది. మేం ఇక్కడ ఉంటే ఇంట్లో ఆయన ఒంటరిగా ఉన్నారు’ అని సల్మాన్ పేర్కొన్నారు.
నిర్వాణ్ తో మాట్లాడుతూ, ‘జో డర్ గయా వో మర్ గయా (భయపడే వాళ్లే మరణిస్తారు) అనే డైలాగ్ గుర్తుందా. కానీ, ఇప్పుడున్న పరిస్థితులకు ఈ డైలాగ్ వర్తించదు. మేం భయపడ్డాం దాన్ని ధైర్యంగా అంగీకరిస్తాం. దయచేసి ఈ పరిస్థితుల్లో మీరు కూడా ధైర్యంగా మాత్రం ఉండకండి, భయపడుతూనే వుండండి’ అని సల్మాన్ చమత్కరించాడు. మనకు ఏమీ కాదులే అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
‘ఈ సమయంలో భయపడిన వాడే తనను తాను కాపాడుకోవడంతో పాటు తన చుట్టూ ఉండే వాళ్లను కూడా రక్షించినవాడు అవుతాడు. ఈ కథ నీతి ఏమిటంటే మనమంతా భయపడ్డాం’ అని నిర్వాణ్ తో కలిసి సల్మాన్ చెప్పారు.