Eye Infection: కొత్త లక్షణం... కళ్ల కలక, జ్వరం ఉంటే 90 శాతం కరోనా!
- కళ్ల కలకతో వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
- జ్వరం కూడా ఉంటే వైద్యులను సంప్రదించండి
- సరోజినీ దేవి ఐ హాస్పిటల్స్ వైద్యుల సూచన
కళ్ల కలక... ప్రతి సంవత్సరమూ సీజనల్ వ్యాధి. ఓ రకమైన వైరస్ కారణంగా వ్యాపించే ఈ వ్యాధి, కొన్ని రోజుల తరువాత వెళ్లిపోతుంది. ఇక కళ్ల కలకతో పాటు జ్వరం కూడా ఉంటే, 90 శాతం వరకూ కరోనా సోకే అవకాశాలు ఉన్నట్టేనని హైదరాబాద్ లోని సరోజినీ దేవి నేత్ర వైద్యశాల నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆసుపత్రిలో కళ్ల కలకతో వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. గతంలో మాదిరిగా కళ్ల కలక వస్తే, కొద్ది రోజుల తరువాత తగ్గిపోతుందన్న నమ్మకంతో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని అంటున్నారు.
చైనాలోని వూహాన్ లో వైరస్ తొలి దశలో కళ్ల కలకతో వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ ను కనుగొన్నట్టు ఓ వైద్యుడు తెలుపగా, ప్రభుత్వం అప్పట్లో ఈ విషయాన్ని కొట్టి పారేసింది. ఆ తరువాతే అక్కడ పరిస్థితి తీవ్రమైంది. ఇక కరోనా వైరస్ శరీరంలో ఉన్నా, ఎటువంటి లక్షణాలూ కనిపించవని చెబుతున్న వైద్యులు, జ్వరం, కళ్ల కలక ఉంటే, వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది సరోజినీ దేవి ఐ హాస్పిటల్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారు. ఆసుపత్రికి వస్తున్న వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే, వారిని క్వారంటైన్ చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు.