GRE: ఇంటి నుంచే జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలు రాయచ్చు!
- ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో మానిటరింగ్
- చైనా, ఇరాన్ వాసులకు మాత్రం నో చాన్స్
- వెల్లడించిన టోఫెల్ ఈడీ శ్రీకాంత్
ప్రపంచ స్థాయిలో జరిగే జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్), టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) వంటి పరీక్షలను ప్రస్తుత పరిస్థితులలో ఆయా అభ్యర్థులు ఇంట్లోనే కూర్చుని రాయవచ్చు. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్) వెల్లడించింది. ఈ సదుపాయం మెయిన్ లాండ్ చైనా, ఇరాన్ వాసులకు మాత్రం అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.
ఇప్పటికే వాయిదా పడిన ఈ పరీక్షలను, పరిస్థితులు కుడుట పడేవరకు ఇంట్లో నుంచే రాసే సదుపాయాన్ని కల్పించనున్నామని టోఫెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ గోపాల్ పీఐటీ వార్తా సంస్థకు తెలిపారు. ఇదే సమయంలో ఇంట్లో పరీక్షలు రాసినప్పటికీ, అత్యున్నత స్టాండర్డ్స్ లోనే ఇవి జరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని, రియల్ టైమ్ హ్యూమన్ మానిటరింగ్ సాంకేతికతను వాడుకోనున్నామని వెల్లడించారు.
కాగా, జీఆర్ఈ, టోఫెల్ పరీక్షల్లో మంచి స్కోరు సాధించిన వారికి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్శిటీల్లో సులువుగా ప్రవేశం లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ పరీక్షలకు ప్రతి సంవత్సరమూ లక్షల మంది సిద్ధమవుతూ ఉంటారు.