Corona Virus: మోదీలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు
- ప్రజలు ఇబ్బందులు పడకుండా మోదీ చర్యలు తీసుకుంటున్నారు
- 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు
- 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు
- 20 కోట్ల మందికి డబ్బు బదిలీ చేస్తున్నారు
భారత్‌లో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై భారత్‌ను ఉదాహరణగా చూపెట్టింది. 'సామాజిక సంక్షేమం కోసం, ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను అందించడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని నేను వివిధ దేశాల ప్రభుత్వాలను కోరాను' అని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియాసిస్ తెలిపారు.
'ఉదాహరణకు... భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. 20 కోట్ల మందికి డబ్బు బదిలీ చేస్తున్నారు. 8 కోట్ల మందికి ఉచితంగా మూడు నెలలకు సరిపడా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు' అని ట్వీట్లు చేశారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు అమలు చేయడానికి ఇబ్బందిపడుతున్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం రుణ విముక్తి కల్పించాలని కోరారు. కొన్ని రోజుల్లో కరోనా సోకిన వారి సంఖ్య 10 లక్షలు దాటనున్నట్లు చెప్పారు.