olympics: ఒలింపిక్స్ వచ్చే ఏడాది ఒక రోజు ముందే!
- 2021 జులై 23 నుంచి ప్రారంభించే చాన్స్
- ముగింపు వేడుక ఆగస్టు 8న
- ఆలోచన చేస్తున్న ఐఓసీ, జపాన్ నిర్వాహకులు
కరోనా వైరస్ దెబ్బకు ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌ను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2021 జులై 23వ తేదీన మొదలుపెట్టి ఆగస్టు 8వ తేదీన ముగించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ నిర్వాహకులు భావిస్తున్నట్టు జపాన్ మీడియా చెబుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో జపాన్‌లో వేసవి కాలం. అయితే, కరోనా ప్రభావంతో వీటిని ఏడాది పాటు వాయిదా వేశారు. వచ్చే ఏడాది వేసవిలోనే పోటీలు నిర్వహించాలని ఐఓసీ ప్లాన్ చేస్తోంది. పాత షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పోటీలు ఆరంభిస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు సమచారం.
ఈ మెగా ఈవెంట్ ఆలస్యం కావడంతో 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన జపాన్‌కు భారీనష్టం వస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి యసుతోషి నిషిముర అంటున్నారు. దీన్ని ఎంతో కొంత భర్తీ చేయాలంటే వచ్చే ఏడాది వేసవిలో పోటీలు నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దాంతో, 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ నిర్వహించాలని ఐఓసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.