America: అమెరికాలో దారుణ పరిస్థితులు.. ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు
- న్యూయార్క్‌లో విషమిస్తున్న పరిస్థితులు
- కరోనా బారిన ఒక్క రోజులోనే 5 వేల మంది
- వచ్చే నెల 12 నాటికి పరిస్థితులు కుదుటపడతాయన్న ట్రంప్
అమెరికాలో పరిస్థితి విషమించేలా కనిపిస్తోంది. కరోనా వైరస్‌తో ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 10 వేల కేసులు నమోదు కాగా, 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 55 వేలకు చేరుకోగా, 780 మంది మృతి చెందారు. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఒక్క రోజే 53 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకింది.
కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మిచిగన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడాలలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక, తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో మాత్రం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. అమెరికా తాజా పరిస్థితిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏప్రిల్ 12 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల గ్లౌజులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్టు తెలిపారు.