G-20: నేడు జీ-20 దేశాధినేతల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ .. పాల్గొననున్న మోదీ
- వైరస్ విస్తృతి కట్టడిపై చర్చించనున్న దేశాధినేతలు
- ప్రత్యేక ఆహ్వానిత దేశాధినేతలు కూడా హాజరు
- నేతృత్వం వహించనున్న సౌదీ రాజు
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నేడు జీ-20 దేశాధినేతలు వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు. జీ-20 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాలైన స్పెయిన్, జోర్డాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వం వహించే ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మోదీ.. సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజలపైనా, ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సమన్వయంతో ఎలా పనిచేయాలన్న విషయాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు.