Indian Railways: ఏప్రిల్ 14 వరకు రైళ్లు కదలవు: రైల్వే శాఖ తాజా నిర్ణయం
- గూడ్స్ రైళ్లు మినహా అన్నీ బంద్
- ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్లు రద్దు
- ఏప్రిల్ 12 తర్వాత తదుపరి నిర్ణయం
గూడ్స్ రైళ్లు మినహా మరే రైళ్లూ వచ్చే నెల 14 వరకు పట్టాలెక్కబోవని రైల్వే శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా వచ్చే నెల 14 వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిజానికి తొలుత ఈ నెల 21 వరకు మాత్రమే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే, నిన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 21 రోజులపాటు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రైల్వే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది. అయితే, ఏప్రిల్ 12 తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొంది.