Corona Virus: గ్రామాల్లో మూఢనమ్మకాలు: కరోనా నుంచి తప్పించుకోవడానికి నీళ్లు పట్టుకుని పరుగులు తీస్తున్న తల్లులు!
- ఐదు ఇళ్ల నుంచి నీళ్లు సేకరిస్తున్న తల్లులు
- వేపచెట్టుకు పోసి కొబ్బరికాయలు కొడుతున్న వైనం
- నమ్మొద్దంటున్న జనవిజ్ఞాన వేదిక
కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రపంచం అల్లాడుతోంది. వేలాదిమంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ కరోనాకు విరుగుడు కనుగొనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అయితే, కరోనా బారి నుంచి ఇలా తప్పించుకోవచ్చంటూ గ్రామాల్లో జరుగుతున్న ప్రచారం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఒకరు, ఇద్దరు కుమారులున్న తల్లులు ఐదు ఇళ్ల నుంచి నీటిని సేకరించి ఆ నీటిని వేపచెట్టుకు పోస్తే కరోనా వైరస్ దరిచేరదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
ఇది నమ్మిన అమాయక తల్లులు నీళ్లు సేకరించి వేపచెట్టువైపు పరుగులు తీస్తున్నారు. ఒక కొడుకు ఉన్నవారు ఒక కొబ్బరికాయ, ఇద్దరున్నవారు రెండు కొబ్బరికాయలు వేపచెట్టుకు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నమ్మకంపై జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు స్పందించారు. ఇలాంటి మూఢనమ్మకాలతో వైరస్‌ను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోంచి బయటకు రాకపోవడమే కరోనా వైరస్‌కు సరైన మందు అని పేర్కొన్నారు. లేనిపోని నమ్మకాలతో వేలంవెర్రిగా రోడ్లపైకి రావొద్దని సూచించారు.