Prakash Raj: ప్రకాశ్ రాజ్ పెద్ద మనసు.. సిబ్బందికి మే నెల వరకు జీతం చెల్లింపు
- తన మూడు సినిమాల డైలీ వర్కర్లకు సగం నెల జీతం
- మరికొందరికీ సాయం చేస్తానని ప్రకటన
- మిగతా వాళ్లు అలానే చేయాలని పిలుపు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ ప్రకటించారు. ఇప్పటికే పలు వ్యాపారాలతో పాటు సినిమా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. దాని ప్రభావం సగటు శ్రమ జీవులపై తీవ్రంగా పడనుంది. రోజువారీ కూలీలు తమ ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సూచించారు. తానే స్వయంగా ఈ పని చేసి ఆదర్శంగా నిలిచారు.
తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు ఇళ్లు, ప్రొడక్షన్ కంపెనీ, ఫౌండేషన్ ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేసినట్టు తెలిపారు. అలాగే, కరోనా కారణంగా ఆగిపోయిన తన మూడు సినిమాల్లో పని చేస్తున్న రోజువారీ వర్కర్లకు కనీసం సగం జీతం ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.
తాను ఇంతటితో ఆగిపోనని, తనకు సాధ్యమైనంత మేరకు వారికి తగిన సాయం చేస్తానని ట్వీట్ చేశారు. ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉన్నవాళ్లంతా అవసరం ఉన్నవారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.