South central railway: కరోనా ఎఫెక్ట్: సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లు రద్దు
- దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
- దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోనూ పలు రైళ్లు నిలిపివేత
- మణుగూరు-సికింద్రాబాద్, మణుగూరు-కొల్హాపూర్ రైళ్లు ఈ నెలాఖరు వరకు రద్దు
ప్రాణాంతక కరోనా వైరస్ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టిన రైల్వే శాఖ అందులో భాగంగా వందలాది రైళ్లను రద్దు చేసింది. తాజాగా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
కొత్తగూడెం నుంచి నేడు బయలుదేరనున్న సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్, కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్, అలాగే, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే మణుగూరు సూపర్‌ఫాస్ట్, కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే, నేటి నుంచి ఈ నెల 31 వరకు మణుగూరు- సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, మణుగూరు - కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది.