Narendra Modi: ఇది క్లిష్టమైన దశ... ఫార్మా కంపెనీలకు ప్రధాని సూచన
- ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
- ఫార్మా రంగం కీలకంగా వ్యవహరించాలని సూచన
- సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మా రంగ ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది క్లిష్టమైన దశ అని, ఈ దశలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఫార్మా కంపెనీలకు సూచించారు.
యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్లు తయారుచేయాలని కోరారు. అవసరమైన ఔషధాల సరఫరా పెంచేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఔషధాల విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మసీలలో కూడా సామాజిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ఔషధాలు హోమ్ డెలివరీ ఇచ్చేందుకే మార్గాలు అన్వేషించాలని కోరారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని అన్నారు.
కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పారు. ఏపీఐల తయారీ, క్లిష్టమైన ఔషధాలు, వైద్యపరికరాల ఉత్పత్తి, నిర్ధారణకు నిధి ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రూ.10 వేల కోట్లు, రూ.4 వేల కోట్లతో రెండు పథకాలు రూపొందించామని వివరించారు.