Dotror Samaram: ఈ కరోనా వల్ల రెండు రోజుల నుంచి నాలో కూడా భయం పెరిగింది: డాక్టర్ సమరం
- కరోనా మరణాలు చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా ఉన్నాయి
- ప్రపంచంలో ఏ దేశాన్నైనా వణికించే శక్తి కరోనాకు ఉంది
- జనతా కర్ఫ్యూ చాలా మంచి కార్యక్రమం
కరోనా మహమ్మారి విషయంలో రెండు రోజుల నుంచి తనలో కూడా కొంచెం భయం పెరిగిందని ప్రముఖ వైద్యులు సమరం అన్నారు. చైనాలో పుట్టిన కరోనా దెబ్బకు ఆ దేశం కంటే ఎక్కువ మరణాలు ఇటలీలో సంభవించాయని... ప్రపంచంలో ఏ దేశాన్నైనా వణికించే శక్తి దానికి ఉందని చెప్పారు. చైనా కఠిన చర్యలు తీసుకోవడంతో అక్కడ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని... మనం కూడా ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండటం మంచి పరిణామమని అన్నారు.
ఇటలీలో కరోనా పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత చర్యలు చేపట్టారని... భారత్ లో ప్రారంభ దశలోనే ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టామని సమరం చెప్పారు. కరోనా బయటి దేశంలో పుట్టిందని, మన దేశంలో పుట్టలేదని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వేరే అని చెప్పారు. చైనాలో ఏది పడితే అది తింటారని అన్నారు. ఈ జబ్బు జంతువుల నుంచి వచ్చిందని... ఇప్పుడు మనిషి నుంచి మనిషికి పాకుతోందని చెప్పారు.
మన సంస్కృతి చాలా గొప్పదని.. మనకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా నమస్కారం మాత్రమే పెడతామని సమరం అన్నారు. అక్కడ కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారని.. కరోనా చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లడం లేదని... నోరు, ముక్కు, కళ్ల ద్వారా వెళ్తోందని చెప్పారు.
జనతా కర్ఫ్యూ గురించి సమరం మాట్లాడుతూ... కరోనా పంజా విసిరిన తర్వాత చైనా, ఇటలీలో పూర్తి స్థాయిలో నిర్బంధం విధించారని... ఇంటి నుంచి ఎవరినీ బయటకు రానివ్వలేదని... ఆహారాన్ని కూడా ఇంటికే అందించారని సమరం తెలిపారు. ఒక వేళ మన దేశంలో కూడా అలాంటి పరిస్థితే వస్తే... ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి రేపటి జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుందని చెప్పారు. మనుషులు కలవడం ద్వారానే ఈ జబ్బు ఎక్కువగా విస్తరిస్తుందని... మన దేశంలో మనుషుల కలయిక చాలా ఎక్కువగా ఉంటుందని... దీంతో, వైరస్ వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రజలను సమాయత్తం చేయడానికి జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుందని చెప్పారు.
వైరస్ విస్తరణను కట్టడి చేయడానికి జనతా కర్ఫ్యూ మంచి కార్యక్రమం అని తనకు అనిపిస్తోందని సమరం తెలిపారు. కరోనా వల్ల ఏమైపోతామోనని జనాల్లో ఒక విధమైన టెన్షన్ పెరిగిందని... చప్పట్లు కొట్టడం, అరవడం, కేకలు వేయడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటి వాటితో మనలో మంచి మూడ్ వస్తుందని.. ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయని, తద్వారా టెన్షన్ కు దూరమవుతామని చెప్పారు. అందుకే జనతా కర్ఫ్యూ పూర్తయిన తర్వాత చివర్లో చప్పట్లు కొట్టాలని సూచించారని... దీంతో మనసు తేలిక పడుతుందని అన్నారు.
కరోనా వైరస్ కు ఇంత వరకు ఎలాంటి మందు లేదని సమరం చెప్పారు. వివిధ వైరస్ లకు వాడే వాటినే ఉపయోగిస్తూ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. పారాసిటమాల్ కూడా దీనికి మందు కాదని... జ్వరం నుంచి ఉపశమనాన్ని మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. కరోనా ముందస్తు చర్యల్లో ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎంతో ముందున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి చర్యలు తీసకుంటున్నాయని చెప్పారు.
విదేశాల నుంచి వస్తున్న వారిని తప్పకుండా క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని సమరం అన్నారు. విదేశాల నుంచి వచ్చే విమానాలను ఆపేయడం కూడా మంచి నిర్ణయమని చెప్పారు. మన దేశంలో వ్యాధి ప్రబలే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని... అయితే అందరూ చాలా అప్రమత్తంగా, పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఏం చెపితే... అందరూ కచ్చితంగా వాటిని అనుసరించాలని సూచించారు. జాగ్రత్తలను పాటించకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.