jennifer haller: కోవిడ్-19తో అల్లాడుతున్న ప్రపంచానికి పెద్ద దిక్కుగా మారిన జెన్నిఫర్.. ఆమె త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!
- ఎంఆర్ఎన్ఏఎన్ 1273 టీకా ప్రయోగానికి ముందుకొచ్చిన జెన్నిఫర్
- తొలి వ్యాక్సిన్ షాట్ ఆమెపైనే
- ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తున్న ప్రపంచం
జెన్నిఫర్ హాలెర్.. 43 ఏళ్ల ఈమె పేరు ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖ అయింది. ఈ మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు శాస్త్రవేత్తలు తొలిసారి రూపొందించిన టీకా ప్రయోగానికి స్వచ్ఛందంగా ఆమె ముందుకొచ్చారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్ స్థాయిలో ఉన్న ఆమె తన శరీరాన్ని ప్రయోగాలకు వేదికగా మార్చారు. 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా క్లినికల్ ట్రయల్స్‌కు ముందుకొచ్చారు.
కరోనా వైరస్ ప్రబలుతుండడంతో అమెరికాలో చాలా సంస్థలు ఇంటి నుంచి పనిచేసేందుకు ఉద్యోగులకు అనుమతి ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. దీంతో వేలాదిమంది నిరుద్యోగులుగా మారారు. అలాంటి వారిలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ అయిన జెన్నిఫర్ భర్త కూడా ఉన్నారు. దీంతో ఆమె ఆలోచనలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితిపై ఆవేదన చెందారు. వారి కుటుంబాల గురించి ఆలోచించారు. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలకు సంబంధించిన ప్రకటన కనబడింది. 15-55 ఏళ్ల లోపు వారు కావాలన్న ప్రకటన ఆమెను ఆలోచనల్లో పడేసింది.
ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇదే మంచి సమయం అని భావించిన ఆమె వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ఆమెతోపాటు నెట్‌వర్క్ ఇంజినీర్ ఒకరు, ఎడిటోరియల్ కోఆర్డినేటర్ మరొకరు క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో తొలి వ్యాక్సిన్ షాట్‌ను తీసుకున్నది జెన్నిఫరే.
ఈ టీకాను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు తయారుచేశాయి. దీని సాంకేతిక నామం ఎంఆర్ఎన్ఏఎన్ 1273(mRNAn1273). నిజానికి ఇప్పటి వరకు మనుషులకు ప్రయోగించని ఈ ఔషధాన్ని తీసుకునేందుకు బోల్డంత ధైర్యం కావాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లాక అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారికి మూడినట్టే. ప్రయోగం విజయవంతం కావాలని, ఆమె పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రపంచం కోరుకుంటోంది. ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తోంది.