Vijay Deverakonda: మహేశ్ బాబు తర్వాత ఆ రికార్డు విజయ్ దేవరకొండ సొంతం!
- హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో విజయ్‌కు అగ్రస్థానం
- వరుసగా రెండో ఏడాది దేవరకొండకే నం. 1 ర్యాంక్
- మహేశ్ బాబు తర్వాత విజయ్‌కే సాధ్యమైన ఈ ఘనత
‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకొని.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ‘హైదరాబాద్ టైమ్స్’ ప్రతి ఏటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో విజయ్ వరుసగా రెండో ఏడాది కూడా నంబర్ వన్‌గా నిలిచాడు.
మోస్ట్ డిబైరబుల్ మెన్–2019 లిస్ట్‌లో ‘బాహుబలి’ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను దాటేసి అతను టాప్ ప్లేస్ సాధించాడు. 2018లో కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో మహేశ్ బాబు తర్వాత ఇలా వరుసగా రెండోసారి నంబర్ వన్ సాధించిన నటుడు విజయ్ కావడం విశేషం.
ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియలో ఫలితాల ఆధారంగా 30 మందితో కూడిన ఈ జాబితాలో రామ్ చరణ్ రెండో స్థానం సాధించాడు. గతేడాది మూడో ప్లేస్‌లో ఉన్న చరణ్ ఈసారి ఒక స్థానం మెరుగవడం విశేషం. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రామ్ పోతినేతి 11వ స్థానం నుంచి ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అయితే, గతేడాది రెండో ప్లేస్‌లో నిలిచిన ప్రభాస్ ఈ సారి నాలుగో స్థానానికి పడిపోయాడు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ గతేడాది ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
గతేడాది 14వ స్థానంలో నిలిచిన సుధీర్ బాబు ఈ సారి 8వ ర్యాంకుకు ఎగబాకాడు. ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ 12వ స్థానం సాధించాడు. గతేడాది అతను 16వ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 19వ స్థానంలో నిలిచాడు. గతేడాది 9వ ప్లేస్‌లో ఉన్న తారక్ ఈ సారి పది స్థానాలు కోల్పోయాడు.