Tomato: మూడు కిలోల టమాటా రూ. 10 మాత్రమే!

Tomato Rate Down to rupees ten for three Kilos
  • మూడు నెలల క్రితం కిలో రూ. 50 పైమాటే
  • ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చిన పంట
  • దారుణంగా పడిపోయిన ధరలతో రైతన్న దిగాలు
నెల రోజుల క్రితం వరకూ కిలో రూ. 20 వరకూ పలికిన టమాటా ధర ఇప్పుడు పాతాళానికి జారిపోయింది. వందల ఎకరాల్లో సాగుచేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధర పడిపోయింది. హోల్ సేల్ మార్కెట్లో కిలోకు రూపాయి కూడా పలకడం లేదు. హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో రూ. 10 కి మూడు కిలోల టమాటా లభిస్తోంది.

సాధారణంగా హైదరాబాద్ కు వికారాబాద్ జిల్లాలోని పూడూరు, మోమిన్ పేట, నవాబుపేట వంటి ప్రాంతాల నుంచి టమాటా వస్తుంటుంది. ఈ ప్రాంతంలో 362 హెక్టార్లలో ఈ సంవత్సరం పంట సాగు చేయగా, రోజూ వేల సంఖ్యలో వస్తుంటాయి. 25 కిలోల టమాటా బాక్స్ రూ. 30కి అమ్మాల్సిన పరిస్థితి.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో టమాటాకు మంచి ధర పలుకుతుంది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటుందని రైతులు భావించారు. మూడు నెలల క్రితం కిలో టమాటా రూ. 50ని కూడా దాటిపోయింది. కానీ క్రమంగా దిగుబడి పెరుగుతూ ఉంటే, ధర దిగొచ్చింది. వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నంతలో మరింతగా జారిపోయి, రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. కూలీల ఖర్చు కూడా రావడం లేదని టమాటా సాగు చేసిన వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Tomato
Hyderabad
Vikarabad
Farmers
Rate

More Telugu News