Jayaprakash Narayan: మీరేమీ దైవాంశ సంభూతులు కారు: సీఎం జగన్ పై జేపీ వ్యాఖ్యలు
- ఎస్ఈసీపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు
- సరైన కారణం ఉంటేనే విమర్శించాలన్న జేపీ
- మీకు నచ్చకపోతే విమర్శిస్తారా? అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు. ఎవరైనా ఒక అంశంలో సరైన కారణాలు ఉంటే విమర్శ చేయొచ్చని, ఓ పని నచ్చకపోతే ఈ కారణంగా నచ్చలేదని చెప్పవచ్చని అన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏదైనా మనకు నచ్చని అంశాన్ని హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో చూసుకోవచ్చని సూచించారు.
"కానీ రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి మీరు పదవిలోకి వచ్చారు. రాజ్యాంగం ద్వారానే మీరు అధికారంలోకి వచ్చారు. మీరేమీ దేవుడి వల్ల రాలేదు. దేవుడేమీ మిమ్మల్ని సృష్టించి పంపించలేదు. మీరేమీ దైవాంశ సంభూతులు కారు. మీరేమీ రాజులు కాదు, చక్రవర్తులు కాదు. మీ మాట శిలాశాసనం కాదు, మీ మాటే తుదిమాట కాదు. ప్రభుత్వ నిర్వహణలో చట్టం, రాజ్యాంగం పరిధిలో మీకు అధికారం ఉంటుంది. అలాగే ఇతర రాజ్యాంగ సంస్థలు కూడా. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, కాగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఇవన్నీ రాజ్యాంగ సంస్థలు. నిర్దిష్టకాలానికి ఆ పదవులను రాజ్యాంగం వారికి కేటాయించింది. ఇష్టం వచ్చినట్టు వారిని తీసేయడానికి మీకెవరికీ అధికారం లేదు. మీ పాత్ర మీది, వారి పాత్ర వారిది. వారి నిర్ణయం నచ్చకపోతే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
విమర్శ చేయడం తప్పుకాదు కానీ, పరిధిని గుర్తెరిగి వ్యవహరించాలి. మీకు నచ్చని నిర్ణయం తీసుకున్నారని, మీ మాట కాదన్నారని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కులం, మతం, ప్రాంతం పేరుతో విమర్శించడం, వాళ్లకు పక్షపాత ధోరణులు అంటగట్టడం చాలా ప్రమాదకరం" అంటూ వ్యాఖ్యానించారు.