Hyderabad: గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా... తెలంగాణలో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్!
- మూతబడ్డ సినిమా హాళ్లు, స్కూళ్లు
- థర్మల్ స్క్రీనింగ్ తో పరీక్ష తరువాతే ఐటీ కంపెనీల్లోకి
- జ్వర లక్షణాలుంటే నేరుగా ఇంటికి పంపుతున్న కంపెనీలు
కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఇప్పటికే పాఠశాలలు, సినిమా హాల్స్, బార్లు, క్లబ్బులు, పబ్బులు మూతపడగా, గూగుల్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్ సహా 20 వరకూ ఎంఎన్సీ ఐటీ కంపెనీలు నేటి నుంచి తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిని ఇచ్చాయి. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో సుమారు 600 వరకూ ఐటీ, బీపీఓ కంపెనీలుండగా, సుమారు 6 లక్షల మంది వరకూ పని చేస్తున్నారు.
ఇక నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ తరువానే కంపెనీల్లోకి ఉద్యోగులను అనుమతిస్తామని, జ్వర లక్షణాలు ఉంటే టెంపరరీగా ఇంటికి పంపి, వారిని ఇంటి నుంచే పని చేయాలని ఆదేశిస్తామని హైసియా (హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజస్ అసోసియేషన్) వర్గాలు వెల్లడించాయి. కాగా, 400 వరకూ చిన్న, మధ్య తరహా కంపెనీలు మాత్రం ఇప్పటివరకూ ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించలేదు. వారందరికీ వ్యక్తిగతంగా ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ కనెక్షన్లు కల్పించలేమని ఈ కంపెనీలు అంటున్నాయి.