Andhra Pradesh: ఏపీలో మరో రెండు కరోనా అనుమానిత కేసులు.. పూణెకు నమూనాలు!
- నేపాల్, వియత్నాం వెళ్లొచ్చిన బాధితులు
- వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు
- ఐసోలేషన్ వార్డుకు తరలింపు
విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఇద్దరు ఏపీ వాసుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిద్దరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పూణెలోని ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అనుమానితుల్లో ఒకరు నేపాల్ పర్యటనకు వెళ్లి రాగా, మరొకరు వియత్నాం వెళ్లి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
కాగా, ఏపీలో ఇప్పటివరకు 79 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది. మరో 65 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు వివరించింది. మరో 13 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి వుందని తెలిపింది.