Corona Virus: కరోనా బాధితులకు ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ, మలేరియాలకు వాడే ఔషధాలు ఇస్తున్న రాజస్థాన్ వైద్యులు!
- ఈ ఔషధాలతో సత్ఫలితాలు వస్తున్నాయి
- ఇటలీ మహిళకు ఇప్పటికే కరోనా నెగటివ్
- ఆమె భర్త కోలుకుంటున్నారన్న వైద్యులు
స్వైన్ ఫ్లూ, మలేరియా, హెచ్ఐవీ పేషంట్లకు వాడే ఔషధాలను కరోనా బాధితులకు వాడుతున్నామని, ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందని రాజస్థాన్, జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజీ వైద్యులు అంటున్నారు. గత నెల 28న కరోనా వ్యాధి సోకి హాస్పిటల్ లో చేరిన ఇటలీ జంట ఆరోగ్యం ఈ యాంటీ-వైరల్ డ్రగ్స్ తో మెరుగు పడిందని వెల్లడించారు. "తొలుత బాధితులకు మలేరియా డ్రగ్ క్లోరోక్వైన్ ను ఇచ్చారు. ఆపై స్వైన్ ఫ్లూకు వాడే ఔషధాన్ని, తరువాత హెచ్ఐవీ డ్రగ్స్ ను ఇచ్చారు. ఈ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చింది" అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి రోహిత్ సింగ్ వ్యాఖ్యానించారు.
రెండు వారాల చికిత్స తరువాత ఇటలీ నుంచి వచ్చి వైరస్ తో ఆసుపత్రిలో చేరిన మహిళకు ఇప్పటికే నెగటివ్ వచ్చిందని, 69 సంవత్సరాల ఆమె భర్త రికవరీ అవుతున్నారని, అతనికి గతంలో ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నా, ఈ ఔషధాలు పని చేశాయని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారు రికవరీ అవుతున్నారని, కేవలం 3.4 శాతం కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.