Corona Virus: కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు... ఖాళీ స్టేడియాల్లో భారత్, దక్షిణాఫ్రికా వన్డేలు!
- ప్రపంచదేశాలకు మార్గదర్శకాలు జారీచేసిన డబ్ల్యూహెచ్ఓ
- స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతించవద్దని కేంద్రం స్పష్టీకరణ
- దేశంలోని అన్ని క్రీడాసంఘాలకు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు
చైనాలోనే కాకుండా అనేక దేశాల్లో కరోనా వైరస్ భారీ ఎత్తున ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కరోనా వైరస్ ను మహమ్మారి అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ దేశాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విధిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డబ్ల్యూహెచ్ఓ ఓ మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో, భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే స్టేడియంలకు ప్రేక్షకులను అనుతించబోరని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు టీమిండియా ఆడే రెండు వన్డేలకు ఇదే తరహా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐకి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజలంతా ఒక్కచోట గుమికూడడాన్ని నిలువరించే చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ, కేంద్రం ఆదేశాలను తాము పాటిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, క్రికెట్ మ్యాచ్ ల కోసం ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు మాత్రమే స్టేడియంలోకి వస్తారు. కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోరు.