Mukul Wasnik: 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కాంగ్రెస్ లీడర్!
- ఒకప్పటి స్నేహితురాలు రవీనా ఖురానాను పెళ్లి చేసుకున్న ముకుల్ వాస్నిక్
- ఇప్పటివరకూ ఆయన బ్రహ్మచారే
- యూపీఏ సర్కారు హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వాస్నిక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన ఒకప్పటి స్నేహితురాలు రవీనా ఖురానాను సోమవారం వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అతికొద్ది మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, మరికొందరు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి రేసులో..
మహారాష్ట్రకు చెందిన ఒకప్పటి సీనియర్ నేత బాలకృష్ణ కుమారుడు ముకుల్ వాస్నిక్. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఈయన ఒకరు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పుడు కొత్త అధ్యక్షుడుగా నియమితులయ్యే అవకాశం ఉన్న వారి పేర్లలో ముకుల్ వాస్నిక్ పేరు ప్రముఖంగా వినిపించింది కూడా.ఇప్పటిదాకా బ్రహ్మచారే..
60 ఏళ్ల ముకుల్ వాస్నిక్ ఇప్పటివరకు బ్రహ్మచారే. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్, రవీనా ఖురానా ముగ్గురూ స్నేహితులు. వారి పెళ్లి సందర్భంగా మనీష్ తివారీ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.‘‘ముకుల్ వాస్నిక్, రవీనాలను 1984–85 సమయంలో తొలిసారి కలిశాను. అప్పట్లో మేమంతా కలిసి రష్యాలోని మాస్కోలో జరిగిన వరల్డ్ యూత్, స్టూడెంట్ ఫెస్టివల్ కు హాజరయ్యాం. వారిద్దరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.