Chandrababu: ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే కన్నీళ్లు పెట్టే పరిస్థితి: చంద్రబాబు నాయుడు

chandrababu fires on ap govt

  • 34% బీసీ రిజర్వేషన్లను 24%కు తగ్గించింది వైసీపీ
  • కొన్ని జిల్లాల్లో  బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణం 
  • వైసీపీ పోకడలపై, అణచివేతలపై ఆ పార్టీ నేతలే కన్నీళ్లు పెడుతున్నారు
  • బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడతాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇవ్వడమే కాకుండా..  బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్ దే' అని చంద్రబాబు తెలిపారు.
 
'బీసీలకు 1987లో 27%, 1995లో 34% రిజర్వేషన్లు ఇచ్చి వారి రాజకీయ సాధికారతకు నాందిపలికాం. సమాజంలో పెత్తందారీ పోకడలకు అడ్డుకట్టవేశాం. అలా 33 ఏళ్లుగా బీసీలు పొందుతున్న పదవులకు కోతపెట్టి, మళ్లీ పెత్తందారీ రాజ్యాన్ని తెచ్చే లక్ష్యంతోనే 34% బీసీ రిజర్వేషన్లను 24%కు తగ్గించింది వైసీపీ' అని పేర్కొన్నారు.
 
'కొన్ని జిల్లాల్లో  బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణం. జడ్పీటీసీ స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారు' అని తెలిపారు.

'చట్టసభల్లో, ప్రభుత్వ విధానాల్లో బీసీల భాగస్వామ్యాన్ని దూరం చేసే కుట్ర ఇది. వైసీపీ పెత్తందారీ పోకడలపై, అణచివేతలపై ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే కన్నీళ్లు పెట్టే పరిస్థితి. బడుగు బలహీన వర్గాల హక్కులను వైసీపీ కాలరాసినా, కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది' అని చెప్పారు.

'అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించాం. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలి. అంబేద్కర్ మాట, ఎన్టీఆర్ బాట, తెలుగుదేశం సిద్ధాంతం... సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News