Kesineni Nani: ఆటోనగర్ కార్మికుల కోసం రూ.1.96 కోట్లు మంజూరు చేసిన కేశినేని నాని
- విజయవాడ ఆటోనగర్ లో వాటర్ ట్యాంకు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
- చేయూతనివ్వాలని కోరిన ఆటోనగర్ ప్రతినిధులు
- ఎంపీ నిధుల నుంచి భారీ మొత్తం కేటాయించిన కేశినేని నాని
టీడీపీ ఎంపీ కేశినేని నాని రవాణా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. గతంలో ట్రావెల్ సంస్థ నడిపిన నానికి విజయవాడ ఆటోనగర్ తో ఎంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఆయన ఆటోనగర్ లో వాటర్ ట్యాంక్, జలశుద్ధి కేంద్రం ఏర్పాటు కోసం భారీగా నిధులు కేటాయించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.
"రవాణా రంగానికి కేంద్రబిందువైన విజయవాడలో 1966లో ఆటోనగర్ ఏర్పడింది. ఇప్పుడది సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఆటోనగర్ లో 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి చేయూతనివ్వాలని ఆటోనగర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు కోరారు. వారి అభ్యర్థనను మన్నించి ఎంపీ నిధుల నుంచి రూ.1.96 కోట్లు మంజూరు చేశాను" అంటూ వివరించారు.