LEPL: లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు.. కీలక ఫైళ్ల స్వాధీనం
- విజయవాడలోని ఆ సంస్థ కార్పొరేట్ భవనంలో దాడులు
- రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన వైనం
- ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని రమేశ్‌పై ఆరోపణలు
లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్‌ఈపీఎల్) కార్యాలయాలపై నిన్న ఐటీ అధికారులు దాడులు చేశారు. విజయవాడలోని రామచంద్రనగర్‌లో ఉన్న ఆ సంస్థ కార్పొరేట్ భవనంలో సాయంత్రం ప్రారంభించిన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. తనిఖీలు జరుగుతున్నప్పుడు భవనంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాడుల సందర్భంగా పలు రికార్డులు, ఫైళ్లు పరిశీలించిన ఐటీ ప్రత్యేక బృందాలు.. కంప్యూటర్లలోని డేటాను విశ్లేషించి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం.
రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ అధినేత లింగమనేని రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం విశేషం. సాయంత్రం ఆరు గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు దాడులు నిర్వహించారు.