Chandrababu: బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు: చంద్రబాబు
- టీడీపీ వచ్చిన తర్వాతే బీసీల పరిస్థితి మెరుగైందన్న బాబు
- వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని పిలుపు
- రాజకీయపరంగా మరిన్ని అవకాశాలు ఇవ్వాలని వెల్లడి
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో టీడీపీ అధినేత పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశల వారీగా బీసీ రిజర్వేషన్లు పెరుగుతూ వచ్చాయని అన్నారు. అనేక చిన్న సామాజిక వర్గాలకు చెందినవారు కూడా చైర్మన్లుగా ఎన్నికయ్యారని వివరించారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు బీసీల పరిస్థితి ఏమంత బాగోలేదని అన్నారు.
"టీడీపీ వచ్చిన తర్వాతే బీసీలకు గుర్తింపు వచ్చింది. బీసీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో కృషి చేసింది. ఇప్పుడీ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా గర్హిస్తున్నాం. ఇది పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం. వెనుకబడిన వర్గాలు శాశ్వతంగా వెనుకబడిపోతున్న తరుణంలో వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. విద్య, ఆర్థిక పరంగానే కాదు రాజకీయపరంగానూ బీసీలకు అవకాశాలు ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకోవడంలో వారిని భాగస్వాములను చేస్తే రాజకీయంగా నిలదొక్కుకునే వీలుంటుంది. ముందుగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన గుర్తింపునివ్వాలి. 1987లో బీసీలకు స్థానిక సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్ ఇచ్చాం" అని వెల్లడించారు.