Afghanisthan: తాలిబాన్లతో అమెరికా చారిత్రాత్మక ఒప్పందానికి ఆదిలోనే ఆటంకం!
- తాలిబాన్లను జైలు నుంచి విడుదల చేయబోము
- అధికార పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి
- స్పష్టంగా చెప్పిన అష్రాఫ్ ఘనీ
ఆఫ్ఘనిస్థాన్ లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా తాలిబాన్లతో అమెరికా చేసుకున్న శాంతి ఒప్పందానికి తొలి అడ్డు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రూపంలో ఎదురైంది. దేశంలో రెండు దశాబ్దాల నుంచి జరుగుతున్న అంతర్యుద్ధానికి స్వస్తి పలుకుతూ, తాలిబాన్లతో డీల్ కుదుర్చుకున్న అమెరికా, ప్రస్తుతం జైళ్లలో ఉన్న 5 వేల మంది తాలిబాన్లను విడుదల చేయిస్తామని హామీ ఇవ్వగా, అది జరిగే పని కాదని ఘనీ తేల్చి చెప్పారు.
ఈ నెల 10 నుంచి ఆఫ్ఘన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో తాలిబాన్ ఖైదీలను విడుదల చేయలేమని ఆయన అన్నారు. ఖైదీల విడుదల అనేది తమ నిర్ణయంపై ఆధారపడుతుందని, తదుపరి చర్చలు జరుగకుండా వారి విడుదల సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
అయితే, అమెరికా శాంతి దూత జల్మే ఖలీద్ జద్ మాత్రం జైళ్లలో ఉన్న తాలిబాన్లు విడుదల అయితేనే, శాంతి ఒప్పందానికి మేలు కలుగుతుందని, తాలిబాన్లలో విశ్వాసాన్ని పెంచాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఇక దేశంలోని మహిళలు మాత్రం, తాలిబాన్లు విడుదల అయితే, ఎటువంటి సమస్యలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.