Ramcharan: ఆయన్ను ప్రతి నిమిషం ఫాలో అయింది ఆ సమయంలోనే: రామ్ చరణ్

Ram Charan says about his father Chiranjeevi

  • హైదరాబాదులో మెగాస్టార్ ది లెజెండ్ పుస్తకావిష్కరణ
  • కార్యక్రమానికి విచ్చేసిన రామ్ చరణ్
  • తండ్రి గురించి చెబుతూ భావోద్వేగాలకు గురైన రామ్ చరణ్

సినీ పాత్రికేయుడు వినాయకరావు రాసిన 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని పార్క్ హయట్ హోటల్ లో ఈ సాయంత్రం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి చిరంజీవి జీవితకథను పుస్తకరూపంలోకి తీసుకురావడం సంతోషదాయకమని జర్నలిస్టు వినాయకరావును అభినందించారు. తమకు చిన్నతనంలో తన తండ్రితో ఎక్కువసేపు గడిపే సమయం ఉండేది కాదని తెలిపారు. షూటింగ్ ముగించుకుని తన తండ్రి రాత్రి వేళలో ఇంటికి వచ్చేవారని, అప్పటికే తాము నిద్రపోయేవాళ్లమని, మళ్లీ ఉదయాన్నే షూటింగ్ కు వెళ్లేవాళ్లని వివరించారు.

దాదాపు 80, 90వ దశకాల్లో తనకు చిరంజీవి సినీ లైఫ్ గురించి, ఆయన పడిన కష్టాల గురించి పెద్దగా తెలిసేది కాదని అన్నారు. "నేను సినిమాల్లోకి వచ్చే సమయానికి నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి గురించి చెప్పమంటే వీవీ వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150కి ముందు, ఆ తర్వాత అని చెబుతాను. ఖైదీ నెంబర్ 150 సినిమాకు ముందు నాన్న రాజకీయాల్లో ఉన్నారు. దాంతో ఆయన సినీ కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోలేపోయాం. కానీ ఖైదీ నెంబర్... చిత్రంతో ఆయనతో ప్రయాణం చేసే అదృష్టం దక్కింది. గతంలో ఎప్పుడూ లేనంతగా, ఆయనను ప్రతి నిమిషం ఫాలో అయ్యాను.

అరవింద్ మామ చెప్పినా, అమ్మ చెప్పినా అదంతా కొంతవరకే. నాకు చిరంజీవి గారు కొత్త కోణంలో అర్థమైంది ఖైదీ నెంబర్... సినిమాతోనే. ఉదయం ఐదింటికే లేచి వర్కౌట్లు చేసుకుని, సెట్స్ పైకి వెళ్లేవారు. ఉదయం ఏడున్నర కల్లా మొదటి షాట్ పూర్తయ్యేది. ఓ గంట ముందు సెట్స్ మీదకు వచ్చే వీలుందా అని ఆలోచించే వ్యక్తి చిరంజీవి గారు. మేం ఆయనకు ఏం ఇవ్వాలో ఇప్పటికీ అర్థంకాదు. కానీ ఆయన మాత్రం మాకు ఏం ఇవ్వాలో ఇప్పటికీ ఆలోచిస్తుంటారు" అంటూ తండ్రి గురించి భావోద్వేగభరితంగా చెప్పారు.

  • Loading...

More Telugu News