Ambati Rambabu: జగన్ కు ఎవరూ శత్రువులు లేరు.. ఏపీ ప్రయోజనాలే ముఖ్యం: అంబటి రాంబాబు

Ambati Rambabu says Jagan has no enemies

  • జగన్ ని ముఖేశ్ అంబానీ కలవడం శుభపరిణామం
  • టీడీపీ నేతలు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు
  • ఏపీలో అంబానీ పెట్టుబడులు పెడితే టీడీపీ నాయకులకు అభ్యంతరమేంటి?

సీఎం జగన్ ని రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ కలవడం శుభపరిణామంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభివర్ణించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు ఎవరూ శత్రువులు లేరని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. అంబానీకి జగన్ కు కుదరదు కదా, ఆయన ఇక్కడికి రావడమేంటని, ఆయనకు జగన్ శాలువా కప్పడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, విషపూరిత మనస్తత్వంతో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అంబానీ ఇక్కడికి రాకూడదని, ఏపీలో పెట్టబడులు పెట్టకూడదని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో అంబానీ పెట్టుబడులు పెడితే టీడీపీ నాయకులకు అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు.

‘ఇంటి వద్దకే పింఛన్లు’  అద్భుత ఫలితాలనిస్తోంది

రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరవై లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగిందని, ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిస్తోందని, ఈరోజు ఆదివారం అయినా లబ్ధిదారులకు పింఛన్లు అందాయని అంబటి తెలిపారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూ, అవినీతికి ఆస్కారం లేకుండా పటిష్టమైన వ్యవస్థను జగన్ నిర్మించారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై, రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ వెళ్లిపోతోందని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News