Luxembourg: లగ్జెంబర్గ్ సంచలన నిర్ణయం.. ప్రజా రవాణా పూర్తిగా ఉచితం!
- దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్
- రైళ్లలో ఫస్ట్ క్లాస్, రాత్రివేళ బస్సు సర్వీసులకు వర్తించని ఉచితం
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కోరలు చాస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు సంపన్న దేశమైన లగ్జెంబర్గ్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తం ఉచిత రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6.1 లక్షల మంది మాత్రమే జీవించే ఈ దేశం ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల మధ్యలో ఉంది. ఆయా దేశాలకు చెందిన దాదాపు 2 లక్షల మంది లగ్జెంబర్గ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది సొంత వాహనాలను ఉపయోగిస్తుండడంతో దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువయ్యాయి.
రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాను దేశం మొత్తం ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది. నిన్నటి నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని ఆంక్షలు మాత్రం ఉన్నాయి. రైళ్లలో ఫస్ట్ క్లాస్ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ఉచితం వర్తించదని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏడాదికి దాదాపు వంద యూరోలు ఆదా కానున్నాయి. ఉచిత రవాణాపై ప్రజలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశం మొత్తం ప్రజా రవాణాను ఉచితం చేసిన తొలి దేశంగా లగ్జెంబర్గ్ రికార్డులకెక్కింది.