Kanhaiya Kumar: థాంక్యూ.. విచారణ త్వరగా పూర్తి చేయండి: తనపై దేశద్రోహం కేసుపై కన్హయ్య
- తనపై దేశ ద్రోహం కేసులో విచారణకు ఢిలీ ప్రభుత్వం అనుమతివ్వడంపై స్పందించిన లెఫ్ట్ నాయకుడు
- రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
- బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావాలనే బయటకు తీశారని విమర్శ
తనపై చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దేశద్రోహం కేసు విచారణకు ఢిల్లీ ప్రభుత్వం అంగీకారం తెలపడాన్ని సీపీఐ నాయకుడు కన్హయ కుమార్ ఆహ్వానించారు. ఈ కేసులో విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. అయితే, ఈ ఏడాది జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పెండింగ్‌లో ఉన్న కేసును బయటికి తీశారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో తాను బీహార్ బెగుసరయ్ నుంచి పోటీ చేసినప్పుడు తనపై చార్జ్‌షీట్ నమోదు చేశారని, ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా దాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రాజకీయ లాభం కోసమే ప్రభుత్వం దేశద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని కన్హయ ఆరోపించారు. ముగ్గురు టెర్రరిస్టులతో ఢిల్లీకి ప్రయాణిస్తున్న జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారి దవీందర్ సింగ్‌పై మాత్రం దేశద్రోహం కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలని అన్నారు.
ఏడాదికాలంగా తొక్కిపెట్టిన తర్వాత ఈ కేసు విచారణకు ఆప్ సర్కారు ఎందుకు అనుమతి ఇచ్చిందో తాను వ్యాఖ్యానించదలచుకోలేదని కన్హయ్య తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం వెలువడిన వెంటనే ‘థ్యాంక్యూ’ అని ట్వీట్ చేశారు. అయితే, విచారణను మాత్రం వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్‌యూ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు కన్హయ్య.. పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి అఫ్జల్‌ను అమరుడిగా కీర్తించారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో కేంద్రం ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసింది.