Chandrababu: ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై మండిపడ్డ చంద్రబాబు!

Chandrababu Slams Jagan Government

  • నిన్న విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • వైసీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారు?
  • ఆందోళనకారుల ముసుగులో ఉన్నది వైసీపీ వాళ్లే
  • ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్న చంద్రబాబు

నిన్న విశాఖపట్నంలో తనకు ఎదురైన అవమానంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వరుస ట్వీట్లు పెట్టారు. "విశాఖ, విజయనగరంలో యాత్రకు అనుమతి అడిగితే మాకు ఎన్నో ఆంక్షలు పెట్టిన పోలీసులు, విమానాశ్రయం వద్దకు వందలాది వైసీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారు? ఆందోళనకారుల ముసుగులో వచ్చిన వైసీపీ కార్యకర్తలను నియంత్రించలేని వాళ్ళు నన్ను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఇది ప్రభుత్వ వైఫల్యమే" అని ఆయన అన్నారు.

ఆపై, "హుద్ హుద్ బీభత్సంతో చెల్లాచెదురైన విశాఖ ఎయిర్ పోర్ట్ ను మేమే దగ్గరుండి పునర్నిర్మించాం. సుందరంగా ఎయిర్ పోర్ట్ ను రూపొందించడంతోపాటు, మొత్తం విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాం. అదే ఎయిర్ పోర్ట్ వద్ద నన్ను అడ్డుకోవడం, గంటల తరబడి నిలిపేయడం విశాఖవాసులు ఎవరూ చేయరు" అని, "ఇది ఖచ్చితంగా వైసీపీ అరాచక శక్తుల పనే.. నా పర్యటన అడ్డుకునేందుకు ఇతర జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలించడం హేయం" అన్నారు.

దాని తరువాత "పోలీసుల అనుమతి ఉన్నా యాత్రను అడ్డుకున్నారంటే, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. వైసీపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ఈ దుర్మార్గాన్ని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు నిరసించాలి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌! సేవ్‌ డెమొక్రసీ" అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News