Nampally Court: నాంపల్లి కోర్టు ఆదేశాలతో ట్విట్టర్, వాట్సాప్, టిక్ టాక్ లపై కేసు నమోదు!
- దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేస్తున్నారంటూ పిటిషన్
- ట్విట్టర్, వాట్సాప్, టిక్ టాక్ లపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టు శ్రీశైలం
- పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం
దేశ వ్యతిరేక, మతపరమైన వీడియోలను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారని ఎస్.శ్రీశైలం అనే పాత్రికేయుడు దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సీఏఏ, ఎన్సీఆర్ లకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులు పోస్టులు పెడితే, వాటిని భారత్ లో పోస్టు చేసినట్టుగా వైరల్ చేస్తున్నారని పిటిషనర్ టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ లపై ఆరోపించారు. భారత్ కు చెందిన టిక్ టాక్, వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థానీలు ఉన్నారని పేర్కొన్నారు. పిటిషనర్ ఆధారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు వాట్సాప్, ట్విట్టర్, వాట్సాప్ లపై కేసులు నమోదు చేశారు. మరి కొన్నిరోజుల్లో నోటీసులు పంపనున్నారు.