Jamia student: కోటి రూపాయాల నష్ట పరిహారం ఇవ్వండి.. పోలీసుల దాడిలో గాయపడ్డ జామియా విద్యార్థి
- సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో గాయపడ్డ జామియా విద్యార్థి డిమాండ్
- ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
- కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు
సీఏఏ అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీలో డిసెంబర్ 15న నిర్వహించిన ఆందోళనలో పోలీసుల చర్యల కారణంగా గాయపడ్డ జామియా యూనివర్సిటీ విద్యార్థి తనకు కోటి రూపాయాల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు అతను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ఆప్ సర్కారు స్పందన కోరింది. ఈ మేరకు మహ్మద్ ముస్తఫా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ హరి శంకర్‌తో కూడిన హైకోర్టు బెంచ్ కేంద్ర హోం శాఖకు, ఢిల్లీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
తనపై దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరిన పిటిషనర్ విన్నపంపై కూడా స్పందన తెలియజేయాలని కోరింది. తదుపరి విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఢిలీ పోలీసుల దాడిలో తాను శారీరకంగా, మానసికంగా గాయపడ్డానని ఇందుకు నష్ట పరిహారంగా తనకు కోటి రూపాయాలు ఇప్పించాలని ముస్తఫా తన పిటిషన్‌లో కోరాడు. అలాగే, తన గాయాలకు చేయించుకున్న వైద్యానికి అయిన ఖర్చులను, ఆసుత్రులకు వెళ్లేందుకు అయిన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశాడు. షయాన్ ముజీబ్ అనే మరో విద్యార్థి కూడా ఈ నెల 17న ఇలాంటి పిటిషనే దాఖలు చేయగా.. ప్రభుత్వం, పోలీసుల నుంచి కోర్టు స్పందన కోరింది.