Azam Khan: భార్య, కుమారుడితో పాటు లొంగిపోయిన ఆజంఖాన్.. జైలుకు తరలింపు!
- ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన కోర్టు
- ఆజంఖాన్ కుటుంబంపై పలు కేసులు
- తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ మొహమ్మద్ ఆజంఖాన్, ఆయన భార్య ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంను ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ రాంపూర్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆజంఖాన్ కుటుంబంపై పలు కేసులు ఉన్నాయి. కోర్టు ఎన్నోసార్లు సమన్లు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో, వీరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. వారం రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలను జారీ చేసిన కోర్టు... తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
ఆజంఖాన్ పై భూకబ్జా, పుస్తకం దొంగతనం, విద్యుత్ చౌర్యం, విగ్రహం దొంగతనం, గేదె దొంగతనం, గొర్రె దొంగతనం వంటి కేసులు ఉన్నాయి. పుట్టినతేదీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసు అబ్దుల్లా ఆజంపై ఉంది. ఎన్నోసార్లు సమన్లు జారీ చేసినా వీరు కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది.