Neil Wagner: రెండో టెస్టులో టీమిండియా మరింత పేస్, బౌన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది: వాగ్నర్
- తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
- రెండో టెస్టు పిచ్ మరింత దూకుడుగా ఉంటుందన్న కివీస్ పేసర్
- భారత్ ఇలాంటి పిచ్ పై గతంలో ఎప్పుడూ ఆడలేదని వ్యాఖ్యలు
న్యూజిలాండ్ లో పర్యటనలో టీమిండియా ఒక్క టి20 సిరీస్ లో తప్ప వన్డే, టెస్టు సిరీస్ ల్లో నిరాశాజనక ఫలితాలు చవిచూసింది. తొలి టెస్టులో దారుణంగా ఓటమిపాలైన కోహ్లీ సేన శనివారం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ టెస్టుకు వేదికగా నిలిచే క్రైస్ట్ చర్చ్ హాగ్లే ఓవల్ పిచ్ పేసర్లకు మరింత సహకారం అందిస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ సీనియర్ పేసర్ నీల్ వాగ్నర్ హెచ్చరికలు జారీ చేశాడు. టీమిండియా ఆటగాళ్లు ఈసారి మరింత పేస్, బౌన్స్ ను ఎదుర్కోక తప్పదని అన్నాడు. తొలి టెస్టులో రౌండ్ ది వికెట్ బౌలింగ్ ను ఆడడంలో టీమిండియా తడబడిన నేపథ్యంలో, క్రైస్ట్ చర్చ్ లోనూ తాము అదే వ్యూహాన్ని అమలు చేస్తామని వాగ్నర్ తెలిపాడు. వెల్లింగ్టన్ పిచ్ పై ఆపసోపాలు పడిన జట్టుకు ఇక్కడి పిచ్ మరింత కష్టాలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించాడు. వారికిది చాలా కొత్తగా ఉంటుందని తెలిపాడు.