Mad Mike: భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించాలనుకున్న 'మ్యాడ్ మైక్' దుర్మరణం
- సొంత రాకెట్లో నింగికి ఎగిరే ప్రయత్నం చేసిన అమెరికా జాతీయుడు
- ప్రయోగం విఫలమై పేలిపోయిన రాకెట్
- పారాచూట్ తో తప్పించుకోవాలని ప్రయత్నించిన మైక్
- దురదృష్టవశాత్తు మృత్యువాత
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భూమి బల్లపరుపుగా ఉందని భావించేవారు. అయితే, ఆధునిక తరం శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉందని సిద్ధాంత సహితంగా నిరూపించారు. కానీ అమెరికాకు చెందిన ఔత్సాహిక వ్యోమగామి మైకేల్ హ్యూస్ అలియాస్ మ్యాడ్ మైక్ మాత్రం భూమి బల్లపరుపుగా ఉందని, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని గతంలో ప్రతిన బూనాడు. ఇప్పుడా 'మ్యాడ్ మైక్' తన ప్రయత్నంలో భాగంగా రాకెట్ లో నింగికి ఎగిసే క్రమంలో దుర్మరణం పాలయ్యాడు. రాకెట్ పేలిపోవడంతో మృత్యువాత పడ్డాడు.
64 ఏళ్ల మైకేల్ హ్యూస్ వృత్తిరీత్యా ఓ స్టంట్ మేన్. అయితే ఖగోళ సంబంధ విషయాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో భూమి బల్లపరుపుగా ఉందన్న వాదనను నిరూపించాలని కంకణం కట్టుకున్నాడు. కాలిఫోర్నియాలోని బార్ స్టోలో ఉన్న తన ఇంటి పెరట్లోనే సొంతంగా రాకెట్ తయారుచేసుకున్నాడు. భూమి నుంచి 1500 మీటర్ల ఎత్తుకు వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నిరూపించాలనుకున్నాడు. ఇందుకు కొన్ని సంస్థలు ఆర్థిక సాయం అందించాయి. కానీ రాకెట్ ప్రయోగం వికటించింది. మైకేల్ హ్యూస్ పారాచూట్ తో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. 'మ్యాడ్ మైక్' విషాదకర పరిస్థితుల్లో మరణించాడని అతని ప్రతినిధి డారెన్ షూస్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.