Rajnath: ఫరూఖ్, ఒమర్, మెహబూబాల విడుదల కోసం ప్రార్థిస్తున్నా: రాజ్ నాథ్ సింగ్
- గత సంవత్సరం ఆగ్సటులో ఆర్టికల్ 370 రద్దు
- అప్పటి నుంచి గృహ నిర్బంధంలోనే ముగ్గురు మాజీ సీఎంలు
- వారిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్న రాజ్ నాథ్
గత సంవత్సరం పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పోలీసులు నిర్బంధించిన ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల విడుదల కోసం తాను ప్రార్ధిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వారి రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ముగ్గురూ సహకరిస్తారని భావిస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.
ఆపై చాలా మందిని విడుదల చేసినా వీరు మాత్రం కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్, వీరి విడుదలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుందని అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కశ్మీర్ పురోగతినే దృష్టిలో ఉంచుకుంటుందని అన్నారు.