- జపాన్ క్రూయిజ్ షిప్ లో పెరుగుతున్న బాధితులు
- ఇప్పటివరకు 621 మందికి వైరస్
- చైనాలో 2 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
జపాన్ సముద్ర జలాల్లో ఆపి ఉంచిన భారీ క్రూయిజ్ షిప్ ‘డైమండ్ ప్రిన్సెస్’లో మరో ఇండియన్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ షిప్ లో వైరస్ బారినపడ్డ ఇండియన్ల సంఖ్య ఏడుకు చేరింది. షిప్లో మొత్తంగా 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు భారతీయులే. తాజాగా వైరస్ సోకిన వ్యక్తి క్యాబిన్ లో పనిచేసే సిబ్బంది అని అధికారులు తెలిపారు.
భారతీయులను రప్పిస్తాం
జపాన్ షిప్ లో ఉండిపోయిన భారతీయులను దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జపాన్ లోని భారత ఎంబసీ తెలిపింది. దీనిపై జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, ఇండియన్లను ప్రత్యేక నౌకలోగానీ, విమానంలోగానీ స్వదేశానికి తరలించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించింది.
మొత్తంగా 621 మందికి..
ఈ షిప్ లో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తంగా 3,711 మంది ఉండగా.. ఇప్పటివరకు 621 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఇందులో మంగళవారం 88 మందికి, బుధవారం 78 మందికి కొత్తగా వైరస్ సంక్రమించింది.
చైనాలో పరిస్థితి దారుణమే..!
చైనాలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. బుధవారం మరో 136 మంది వైరస్ బాధితులు మరణించారని, మొత్తం మృతుల సంఖ్య రెండు వేలు దాటిందని చైనా అధికారులు ప్రకటించారు.