Visakhapatnam District: 29 నుంచి అరకు ఉత్సవాలు... పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి
- రెండు రోజులపాటు సందడే సందడే
- ఏజెన్సీ సందర్శకులకు ఇదో ముచ్చటని వెల్లడి
- ఉత్సవాల కోసం రూ.కోటి వ్యయం
విశాఖ జిల్లాలో ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఈనెల 29 నుంచి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం దాదాపు కోటి రూపాయలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. అరకు ఉత్సవాల కోసం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ఈ రోజు మంత్రి విశాఖనగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక స్వర్గధామంగా భావించే విశాఖ ఏజెన్సీపట్ల సందర్శకుల్లో మరింత ఆసక్తి కలిగించే లక్ష్యంతో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంప్రదాయ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు అరకు లోయ. ఏటా ఈ ప్రాంతాన్ని దేశ, విదేశీయులు లక్షలాదిమంది సందర్శిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏటా ఈ శీతల ప్రాంతంలో హాట్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేది.