Maharashtra: కూతుర్ని పెళ్లి మంటపానికి, అత్తారింటికి హెలికాప్టర్‌లో పంపిన తండ్రి!
- గారాలపట్టి ముచ్చటపడిందని గగన విహారం
- రెండు గ్రామాల మధ్య 25 కిలోమీటర్ల దూరం
- చేసిన ఖర్చు రూ.9 లక్షలు
‘అవేరా ఉన్నవారి చమక్కులు’...అంటాడు ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి. నిజమే, డబ్బుంటే కొండమీది కోతినైనా తెచ్చివ్వొచ్చంటారు పెద్దలు. మరి పెళ్లిరోజు హెలికాప్టర్ ప్రయాణం కోటీశ్వరుడైన తండ్రికి ఓ లెక్కా. ఇంతకీ ఏమిటి విషయం అంటారా? అయితే చదవండి.
పెళ్లయ్యాక అత్తారింటికి కారు, బస్సు, రైలులో పంపించడం సర్వ సాధారణం. కానీ కుమార్తె ముచ్చట తీర్చడం కోసం ఓ తండ్రి హెలికాప్టర్ బుక్ చేశాడు. తన పెళ్లినాడు ఊరి నుంచి మంటపానికి తనను హెలికాప్టర్‌లో పంపించాలని, వివాహం అయ్యాక అత్తారింటికి కూడా హెలికాప్టర్‌లోనే పంపాలని ఓ కుమార్తె తండ్రితో చెప్పింది. కూతురు ముచ్చట తీర్చడం కంటే ఆ తండ్రికి కావాల్సింది ఏముంటుంది. ఇందుకోసం రూ.9 లక్షలు వెచ్చించాడు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఆర్తాపూర్ తహసీల్ పరిధి కోండా గ్రామ సర్పంచ్ రామారావు కదం కుమార్తె శిల్ప. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కూతురికి హింగోళి జిల్లా ఔండా తహసీల్ పరిధిలోని ఉక్లి గ్రామానికి చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మోహన్ గైక్వాడ్‌తో పెళ్లి కుదిరింది. ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆర్తాపూర్ తహసీల్ కేంద్రంలోని మంటపంలో పెళ్లి.
అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వరుడి స్వగ్రామం. రెండు చోట్లకు తనను హెలికాప్టర్‌లో పంపాలని కూతురు కోరింది. దీంతో వధువు తండ్రి తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి ముందుగానే హెలికాప్టర్ బుక్ చేశాడు. తొలుత కూతురిని పుట్టినింటి నంచి పెళ్లి మండపానికి సాగనంపాడు.
వివాహ తంతు పూర్తయ్యాక మెట్టినింటికి కూడా హెలికాప్టర్‌లోనే సాగనంపి ఆమె కోరిక తీర్చాడు. ఈ ఘట్టం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది.