Prasanna kumar reddy: ’ఇదే చివరిసారిగా చెబుతున్నా..‘ అంటూ అధికారులను హెచ్చరించిన వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి
- మా నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోతే ఊరుకోను
- మా గవర్నమెంట్ లో మా వాళ్లకు గౌరవం ఇవ్వరా?
- అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎందుకు ఉండాలి?
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోమారు వార్తల్లో నిలిచారు. తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు గౌరవం ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా, వారికి సమాధానం చెప్పకపోయినా ఊరుకోనంటూ అధికారులను హెచ్చరించారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను గంటల తరబడి ‘వెయిట్ చేయించడం’ కరెక్టు కాదని సూచించారు.
"మా గవర్నమెంట్ లో మా నాయకులకు, మా కార్యకర్తలకు మీరు గౌరవం ఇవ్వనప్పుడు మండలాల్లో, నియోజకవర్గాల్లో మీరు ఎందుకు ఉండాలి? ఇదే చివరిసారిగా చెబుతున్నా.. ఫలానా అధికారి మమ్మల్ని అవమానించారని ఇంకెవరైనా నాకు ఫోన్ చేసి చెబితే మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. యాక్షన్ మాత్రం ఇమిడియట్ గా ఉంటుంది.
నా సంగతి తెలీదు. చాలా గౌరవం ఇస్తా.. దగ్గర పెట్టుకుంటా. అది తారుమారైతే మాత్రం నేనేందో మీకు చూపిస్తానని అధికారులను హెచ్చరిస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే మండలాల నుంచి వెళ్లిపోవచ్చు. ఇంకోసారి ఇటువంటిది జరిగితే.. ఇంకొక ప్రసన్నకుమార్ రెడ్డిని చూస్తారు మీరు. అది మర్చిపోవద్దు‘ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని వవ్వేరులో నిన్న నిర్వహించిన ధాన్యపు కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అధికారిక సభలో ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.