Sachin Tendulkar: నా క్రికెట్ జీవితంలో అదో మధుర క్షణం: సచిన్ టెండూల్కర్
- లారస్ స్పోర్టింగ్ అవార్డు-2020కి ఎంపిక
- 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో మాస్టర్ అద్భుత ఫీట్
- అవార్డుల ప్రదానోత్సవంలో లిటిల్ స్టార్ కు అత్యధిక ఓట్లు
టీమిండియా మాజీ కెప్టెన్, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్‌ను ప్రతిష్టాత్మక 'లారస్ స్పోర్టింగ్ అవార్డు-2020' వరించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక్ బౌలర్ కులశేఖర వేసిన బంతిని సిక్స్ గా బాది జట్టును రెండోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిపిన ఘనత సచిన్ ది. ఆ సందర్భంలో జట్టు ఆటగాళ్లంతా సచిన్ ను తమ భుజాలపై కూర్చుండబెట్టుకుని స్టేడియం చుట్టూ కలియతిరిగారు.
ఈ నేపథ్యంలో లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్ కు అత్యధిక ఓట్లు రావడంతో ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. బెర్లిన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతులు మీదుగా మాస్టర్ ఈ అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నా జీవితంలో అదో మధుర క్షణం. . క్రికెట్ లో ప్రపంచకప్ గెలవడం ఓ అద్భుతం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఆ సమయంలో దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. క్రీడలు మన జీవితంలో ఎంత ముఖ్యమో ఈ సందర్భం గుర్తుచేస్తుంది. అందుకే ఇప్పటికీ ఆ మధుర జ్ఞాపకం నాతోనే ఉంది' అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఇంకా మాట్లాడుతూ 'నేను పదేళ్ల వయసులో ఉండగా 1983లో కపిల్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ గెల్చుకుంది. అప్పుడు దాని ప్రాముఖ్యత నాకు అంతగా తెలియదు. అందరిలా నేను సంబరాలు చేసుకున్నాను అంతే. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడే ఆ గొప్పతనం ఏంటో నాకు తెలిసింది' అంటూ పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా సచిన్ గుర్తు చేసుకున్నాడు.