Chandrababu: 9 నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు: మేధోమథన సదస్సులో చంద్రబాబు

AP ex CM Chandrababu fires on YS Jagan Reddy

  • మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మేధోమథన సదస్సు
  • రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని పిలుపు
  • జగన్‌ పాలన చూసి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయన్న బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) మేధోమథన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాగార్జున యూనివర్సిటీలో మూడు రాజధానుల అంశంపై సెమినార్ నిర్వహించడమేంటని ప్రశ్నించిన బాబు.. ఒకే రాజధాని ఉండాలన్న విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేయడమేంటని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని విద్యార్థి నాయకులకు పిలుపునిచ్చారు. తమ హయాంలో రాష్ట్రానికి రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరితే ఇప్పుడు అందులో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను రద్దు చేసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు.

టీఎన్ఎస్ఎఫ్‌ను బలోపేతం చేస్తామని, పార్టీలో ప్రాధాన్య విభాగంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, లోకేశ్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి తదితరులు మాట్లాడారు.

Chandrababu
YS Jagan
TNSF
Andhra Pradesh
  • Loading...

More Telugu News