Skull Breaker: 'పబ్జీ'ని మించిన కిల్లర్... 'స్కల్ బ్రేకర్'!
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
- ప్రమాదం జరిగితే తలకు, వెన్నెముకకూ ప్రమాదం
- దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
పబ్జీ... ఈ గేమ్ పేరు వినని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండడు. ఆడుతూ ఉండగా, దానికి బానిసగా మారి ప్రాణాలను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా, ఇప్పుడు మరో కిల్లర్ గేమ్ వైరల్ అవుతోంది. దానిపోరు 'స్కల్ బ్రేకర్'. వాస్తవానికి ఇది వీడియో గేమ్ కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియో. దీన్ని ముగ్గురు కలిసి ఆటలా ఆడాలి. ఈ ఆట ఆడితే, వెన్నెముకకు, తలకు తీవ్ర గాయాలు కావడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక 'స్కల్ బ్రేకర్' విషయానికి వస్తే... ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతూ ఉంటారు. మరో వ్యక్తి, వారి మధ్యలో నిలబడి అలాగే చేస్తుంటారు. మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను మిగతా ఇద్దరూ తమ కాళ్లతో తన్ని పడేయాలి. ఇలా పడ్డప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి తలకు, వెన్నెముకకు కాళ్లకు ఏమైనా జరగవచ్చు. ఈ వీడియో వైరల్ అవుతూ ఉండటంతో చిన్నారులు, యూత్ ఈ చాలెంజ్ మత్తులో కూరుకుపోతున్నారు. ఇప్పటికే 'స్కల్ బ్రేకర్'ను ఫాలో అవుతూ గాయాల పాలయ్యారు. దీనికి పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.