Nirbhaya: నిర్భయ దోషి పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- తాను మానసిక స్థిరత్వాన్ని కోల్పోయానన్న వినయ్ శర్మ
- ఈ విషయాన్ని రాష్ట్రపతి పట్టించుకోలేదంటూ పిటిషన్
- వినయ్ మానసికంగా బలంగా ఉన్నాడన్న కేంద్రం
తనకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంపై నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జైల్లో పెట్టిన టార్చర్ వల్ల తాను మానసిక స్థిరత్వాన్ని కోల్పోయానని... ఈ విషయాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదంటూ వినయ్ పిటిషన్ వేశాడు. వినయ్ మానసికంగా బలంగా ఉన్నాడని విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఇరువైపు వాదనలను విన్న సుప్రీంకోర్టు అతని పిటిషన్ ను కొట్టేసింది.
ఉరితీతను జాప్యం చేయడానికి నిర్భయ దోషులు ఒక్కొక్కరుగా రకరకాల పిటిషన్లను వేస్తున్న సంగతి తెలిసిందే. న్యాయపరమైన అవకాశాలను వారు వినియోగించుకుంటున్నారు. ఫిబ్రవరి 1నే వీరిని ఉరి తీయాల్సి ఉంది. అయితే, ఒక్కరోజు ముందు వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడంతో ఢిల్లీ కోర్టు ఉరిశిక్షపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు శిక్షను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.