Online Engagement: రోజులు మారాయ్!.. సోషల్ మీడియాను చుట్టేస్తున్న ఆన్లైన్లో నిశ్చితార్థం వీడియో!
- కారణాంతరాల వల్ల ముహూర్తానికి రాలేకపోయిన వధూవరులు
- ఆన్లైన్లోనే నిశ్చితార్థం కానిచ్చేసిన కుటుంబ సభ్యులు
- సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
మనిషి జీవితంలో సాంకేతికత ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఒకప్పుడు ప్రతీ చిన్నపనికీ బయటకు వెళ్లాల్సి వచ్చేది. టెక్నాలజీ పుణ్యమా అని కాలు కదపకుండానే అన్నీ మన ఒళ్లో వచ్చి వాలుతున్నాయి. ఇప్పుడన్నీ ఆన్లైన్ పలకరింపులే. ఖండాంతరాల్లో ఉన్నా కళ్లముందే ఉన్నట్టు ఆన్లైన్ పలకరింపులు. ఇప్పుడీ ఆన్లైన్ కాస్తా వేడుకలకూ పాకింది. గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ఆన్లైన్లో నిశ్చితార్థం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
వేర్వేరు దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులకు పెళ్లి కుదిరింది. వారిద్దరికీ నిశ్చితార్థం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు ముహూర్తం పెట్టారు. అయితే, వేర్వేరు కారణాల వల్ల అమ్మాయి, అబ్బాయి గుజరాత్ రావడం కుదరలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. అదే ‘ఆన్లైన్ ఎంగేజ్మెంట్’.
ఈ విషయాన్ని వారికి చెప్పడంతో వారు కూడా ఓకే అనేశారు. దీంతో ముహూర్తం రోజున ఇరు కుటుంబాల వారు వధూవరులకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. అనంతరం రెండు ఫోన్లను పీటలపై పెట్టి సంప్రదాయ బద్ధంగా నిశ్చితార్థం జరిపించారు. అమ్మాయి, అబ్బాయికి ఫోన్లోనే తిలకం దిద్ది కొత్తబట్టలు చూపించారు. అనంతరం అక్షతలు వేసి దీవించారు. ఈ ఆన్లైన్ నిశ్చితార్థం వీడియోపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvijaya.raghava.54%2Fvideos%2F1428168767365510%2F&show_text=0&width=269" width="269" height="476" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>