army soldier: కుటుంబ సభ్యులపై ఆర్మీ రిటైర్డ్ జవాన్ కాల్పులు.. పిస్టల్ లాక్కుని కాల్చి చంపిన కుమార్తె
- భార్యతో గొడవ జరగడమే కారణం
- భార్య, కుమార్తె ఇద్దరికీ బుల్లెట్ గాయాలు.. పరిస్థితి సీరియస్
- యూపీలోని మథుర జిల్లాలో ఘటన
భార్యతో గొడవ పెట్టుకున్న ఆర్మీ రిటైర్డ్ జవాను పిస్టల్ తో కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపాడు. దీనిపై అలర్ట్ అయిన కుమార్తె పిస్టల్ లాక్కుని కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లా మితౌలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో జవాన్ భార్య, కుమార్తెలకు బుల్లెట్లు తగలడంతో హాస్పిటల్ కు తరలించారు.
భార్యతో గొడవపడి..
మితౌలీ గ్రామానికి చెందిన చేత్రం (వయసు 45 ఏళ్లు) ఆర్మీలో సోల్జర్ గా పనిచేసి రిటైరయ్యాడు. ఆయన భార్య రాజ్ కుమారి (38 ఏళ్లు), కుమార్తె ఆల్కా (19 ఏళ్లు), కుమారుడు ఆదర్శ్ (13 ఏళ్లు). సోమవారం రాత్రి చేత్రం, రాజ్ కుమారి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి పరిస్థితి తీవ్రమైంది.విపరీతంగా కోపం వచ్చిన చేత్రం ఇంట్లో దాచిపెట్టిన పిస్టల్ తీసుకొచ్చి భార్యను కాల్చాడు. తర్వాత ఆదర్శ్ ను కాల్చబోతుండగా.. ఆల్కా అడ్డుపడి, పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ పెనుగులాటలో ఆల్కాకు బుల్లెట్ తగిలింది. చివరికి పిస్టల్ లాక్కున్న ఆల్కా కాల్చడంతో చేత్రం అక్కడికక్కడే చనిపోయాడు.