MNS: పోలీసులకు 48 గంటల పాటు స్వేచ్ఛ ఇవ్వండి.. ఆ పనేదో వారే చూసుకుంటారు: కేంద్రాన్ని కోరిన రాజ్ థాకరే
- ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆందోళనలు
- నిరసనకారులను హెచ్చరించిన రాజ్ థాకరే
- భారతదేశం ధర్మసత్రం కాదని స్పష్టీకరణ
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతు తెలిపిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నిరసనకారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతుగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే మాట్లాడుతూ.. ఈ రెండింటికీ వ్యతిరేకంగా ముస్లింలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు.
వ్యతిరేక ప్రదర్శనల్లో హింసకు ఎందుకు పాల్పడుతున్నారో? ఆస్తులను ఎందుకు దహనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆయన.. ఇకపై ఇలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాయికి రాయితో, కత్తికి కత్తితో సమాధానం చెబుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ధర్మశాల కాదని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెంటనే దేశం నుంచి వెనక్కి పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారిని తరిమివేసేందుకు పోలీసులకు 48 గంటలపాటు స్వేచ్ఛ ఇవ్వాలని రాజ్ థాకరే కోరారు.